సొంత ఇంట్లో ఐదేళ్ల పాటు చీకటి గదిలో బందీ.. తండ్రి మృతి.. ఎముకల గూడులా కూతురు!

  • తండ్రిని, దివ్యాంగురాలైన కూతురిని ఐదేళ్లుగా బంధించిన కేర్‌ టేకర్లు
  • తిండి పెట్టకుండా హింసించడంతో ఎముకల గూడులా మారిన తండ్రీకూతుళ్లు
  • చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
  • చీకటి గదిలో వివస్త్రగా, అస్థిపంజరంలా మారిన 27 ఏళ్ల యువతిని చూసి బంధువుల కన్నీరు
ఇదొక హృదయ విదారక గాథ!
సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన!
ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. 

రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా రిటైరై హుందాగా బతికిన ఒక వృద్ధుడిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్ టేకర్లు బందీలుగా మార్చి నరకం చూపించారు. ఐదేళ్ల పాటు సాగిన ఈ చిత్రహింసల కారణంగా ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా, ఆయన కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఓంప్రకాష్ సింగ్ రాథోడ్ (70) రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. 2016లో భార్య మరణించాక, తన 27 ఏళ్ల దివ్యాంగురాలైన కుమార్తె రష్మితో కలిసి ఉంటున్నారు. వారిని చూసుకోవడానికి రామ్ ప్రకాష్ కుష్వాహా, ఆయన భార్య రమాదేవిని కేర్ టేకర్లుగా కుటుంబ సభ్యులు నియమించారు. అయితే ఈ దంపతులు వారిద్దరినీ ఇంటి కింది గదిలో బంధించి, తాము మేడ మీద విలాసంగా గడపడం మొదలుపెట్టారు. బంధువులు ఎవరైనా చూడటానికి వస్తే.. "ఓంప్రకాష్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదు" అని చెప్పి వెనక్కి పంపించేవారు.

సోమవారం ఓంప్రకాష్ మరణించాడన్న వార్త తెలిసి బంధువులు ఇంటికి వెళ్లి, అక్కడి దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. ఎప్పుడూ సూటు, టై వేసుకుని హుందాగా కనిపించే ఓంప్రకాష్ శరీరం ఎముకల గూడులా మారిపోయి ఉంది. ఇక చీకటి గదిలో వివస్త్రగా పడి ఉన్న ఆయన కుమార్తె రష్మి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. 27 ఏళ్ల ఆ యువతి ఆకలి కారణంగా 80 ఏళ్ల వృద్ధురాలిలా అస్థిపంజరంలా మారిందని బంధువు పుష్పా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓంప్రకాష్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. ప్రస్తుతం రష్మి బాధ్యతను బంధువులు తీసుకున్నారు. నమ్మిన వారిని ఇలా చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News