KTR: 'పాత బాస్' కోసమే రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును నిలిపివేశారు: కేటీఆర్

KTR Claims Revanth Reddy Favoring Old Boss Chandrababu
  • పాత బాస్ చంద్రబాబును మెప్పించడానికే పాలమూరు ప్రాజెక్టును ఆపారన్న కేటీఆర్
  • కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • ఆర్థిక ప్రయోజనాల కోసమే జీహెచ్‌ఎంసీ విభజనకు కుట్ర అంటూ ఫైర్
  • ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ కావడం లేదని సీఎం చెప్పగలరా అని ప్రశ్న
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై సర్పంచ్ ఎన్నికలే ప్రజా తీర్పు అని ఉద్ఘాటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 'పాత బాస్', ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాజీ సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే భయంతో పాటు, చంద్రబాబుకు ఆగ్రహం కలుగుతుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పనులను ముందుకు సాగనీయడం లేదని ఆయన విమర్శించారు.

సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, పాలమూరు ప్రాజెక్టుకు కేవలం 45 టీఎంసీల కేటాయింపులను అంగీకరించడం రాష్ట్రానికి నష్టదాయకమని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు అంగీకరించిందని, దాని ఆధారంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని, దానిపై ఎన్ని విచారణలు జరిపినా రాజకీయంగా తమకు నష్టం లేదని, నీళ్లు ఇచ్చిందెవరో ప్రజలకు తెలుసని అన్నారు.

ఆర్థిక ప్రయోజనాల కోసమే, మర్చంట్ బ్యాంకర్లు, బ్రోకర్ల సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అసెంబ్లీలో చర్చిస్తామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందిస్తూ, నిఘా వ్యవస్థలు నెహ్రూ కాలం నుంచి ఉన్నాయని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ కావడం లేదని సీఎం కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నించారు.

సిట్‌లు, విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పాలనపై ప్రజా తీర్పు అని, రెండేళ్లలోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.
KTR
Revanth Reddy
Palamuru Rangareddy project
Telangana politics
Chandrababu Naidu
BRS
Congress
Kaleshwaram project
GHMC
Telangana government

More Telugu News