DK Shivakumar: జనవరి 6న లేదా 9వ తేదీన డి.కె.శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

DK Shivakumar to be CM on Jan 6th or 9th Says MLA
  • 200 శాతం డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారన్న రామనగర ఎమ్మెల్యే
  • ఏం జరుగుతుందో చూద్దాం.. నాకైతే నమ్మకం ఉందన్న ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్
  • మేం మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేమన్న రామనగర ఎమ్మెల్యే
వచ్చే సంవత్సరం జనవరి 6 లేదా 9వ తేదీన డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రామనగర ఎమ్మెల్యే పలు సందర్భాలలో శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.

"ఆయన (డి.కె.శివకుమార్) తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. దీనిని నేను 200 శాతం కచ్చితంగా చెబుతున్నాను. ఈ విషయాన్ని నాకు నేనుగా చెప్పడం లేదు. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు చెప్పడంతో నేను ఈ ప్రకటన చేస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.

వర్షాలు, విషాదాలను అంచనా వేసే వారు ఉన్నారని, ఇప్పుడు ఈ విషయం కూడా తనకు అలాంటి వారి ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. 2026 జనవరి 6న లేదా 9న డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఏం జరుగుతుందో చూడాలని, తనకైతే పూర్తి నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

శివకుమార్ విషయంలో తాము ఇంకా మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. డి.కె. శివకుమార్ తమ నాయకుడని, ముఖ్యమంత్రి పదవి విషయంలో జరిగిన ఒప్పందం గురించి ఆయన మాతో చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డి.కె. శివకుమార్, పార్టీ అధిష్ఠానానికి మధ్య అలాంటి అవగాహన లేకుంటే ఆయన చెప్పి ఉండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజాయతీ కలిగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య: బైరతి సురేశ్

దేశంలో నిజాయతీ కలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది సిద్ధరామయ్య అని కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్ అన్నారు. సిద్ధరామయ్య 16 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారని, ఆయన విజయాల పట్ల చాలామంది అసూయపడుతున్నారని ఆయన అన్నారు. ఆయనపై అసూయపడేవారిని కూడా తమ వారిగా భావించి క్షమిస్తామని ఆయన పేర్కొన్నారు. 1984 నుంచి మంత్రిగా ఉన్న సిద్ధరామయ్య వంటి నిజాయతీ కలిగిన ముఖ్యమంత్రి మరొకరు లేరని ఆయన అభిప్రాయపడ్డారు.
DK Shivakumar
Karnataka politics
Chief Minister
Siddaramaiah
Iqbal Hussain
Congress party

More Telugu News