Dronamraju Sreekanth Phani Kumar: 17 ఏళ్ల విడాకుల పోరుకు ముగింపు: భార్యకు రూ. 50 లక్షలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం!

Telangana High Court Ends 17 Year Divorce Battle Orders Husband to Pay 50 Lakhs
  • దాదాపు రెండు దశాబ్దాల న్యాయపోరాటం తర్వాత దంపతులకు విడాకులు
  • మూడు నెలల్లోపు నగదు చెల్లిస్తే.. భర్త ఆస్తిపై భార్యాబిడ్డలకు మరే ఇతర హక్కులు ఉండవన్న న్యాయస్థానం 
  • 17 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నందున, ఇక కలిసి ఉండే అవకాశం లేదని కోర్టు నిర్ధారణ
17 ఏళ్ల సుదీర్ఘ విడాకుల వివాదానికి తెర దించుతూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో భార్యకు శాశ్వత పరిహారం కింద రూ. 50 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ద్రోణంరాజు శ్రీకాంత్ ఫణి కుమార్, విజయలక్ష్మిలకు 2002లో వివాహం జరగ్గా.. 2003లో కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2008లో భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, భార్య మాత్రం పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉంటానని 'కాపురానికి పంపాలని' కోరుతూ పిటిషన్ వేసింది.

ఈ వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల మధ్య తీవ్రమైన అపనమ్మకం ఉందని, ఇన్నేళ్లు విడివిడిగా ఉన్నాక వారిని బలవంతంగా కలిపి ఉంచడం వల్ల ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. ఇది తిరిగి కోలుకోలేని వివాహ బంధమని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.

భార్య, కుమార్తె భవిష్యత్తు అవసరాల కోసం మూడు నెలల వ్యవధిలో రూ. 50 లక్షలు ఏకమొత్తంగా చెల్లించాలని భర్తను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, భర్తకు సంబంధించిన ఆస్తులు లేదా ఇతర ఆర్థిక లావాదేవీలపై భార్యకు గానీ, కుమార్తెకు గానీ ఎటువంటి హక్కులు ఉండవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
Dronamraju Sreekanth Phani Kumar
Telangana High Court
Divorce case
Alimony
Family court
Justice K Lakshman
Justice Narsing Rao Nandikonda
Matrimonial dispute

More Telugu News