డాక్యుమెంట్లు దొంగిలించి... పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఇమంది రవి!

  • ఐ-బొమ్మ నిర్వాహకుడి కేసులో కీలక పరిణామం
  • మరొకరి పేరుతో ఫేక్ పాన్ కార్డు, లైసెన్స్ సృష్టి
  • రూమ్‌మేట్ అంటూ ఇమంది రవి చెప్పింది అబద్ధమని నిర్ధారణ
  • తనకు రవితో సంబంధం లేదన్న అసలు ప్రహ్లాద్ వెల్లేల
  • రేపటితో ముగియనున్న ఇమంది రవి పోలీస్ కస్టడీ
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమంది రవి, మరొక వ్యక్తి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో రవి ఫేక్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారుచేసుకుని వినియోగించినట్లు తేలింది.

విచారణ సమయంలో ప్రహ్లాద్ తన రూమ్‌మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రహ్లాద్ వెల్లేలను హైదరాబాద్‌కు పిలిపించారు. కస్టడీలో ఉన్న రవిని ఎదురుగా ఉంచి ప్రహ్లాద్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది.

"నాకు ఇమంది రవి ఎవరో తెలియదు. నా పేరు మీద పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి షాక్‌కు గురయ్యాను" అని ప్రహ్లాద్ పోలీసులకు స్పష్టం చేశాడు. దీంతో రవి చెప్పిన రూమ్‌మేట్ కథ కట్టుకథ అని తేలిపోయింది. ప్రహ్లాద్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగిలించి, వాటి ఆధారంగా నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నవంబర్ 2025లో మొదలైన ఈ కేసు విచారణలో, ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి ఒక్కడే నిర్వహించినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. కాగా, రేపటితో (డిసెంబర్ 29) ఇమంది రవి పోలీసు కస్టడీ ముగియనుంది.


More Telugu News