ముగిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఓటింగ్... కాసేపట్లో ఫలితాలు!

  • పెద్ద, చిన్న నిర్మాతల ప్యానెళ్ల మధ్య తీవ్ర పోటీ
  • పోలింగ్ సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం
  • సాయంత్రం 6 గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలు
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలాకాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై టాలీవుడ్‌లో మొదటి నుంచి తీవ్ర ఆసక్తి నెలకొంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ప్యానెళ్లు హోరాహోరీగా తలపడ్డాయి. చిన్న నిర్మాతల మద్దతుతో సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలో 'మన ప్యానెల్' బరిలో నిలవగా, అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు వంటి వారి మద్దతుతో 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' పోటీ చేసింది. దీంతో ఈ ఎన్నికలు పెద్ద, చిన్న నిర్మాతల మధ్య పోరుగా మారాయి.

మొత్తం 3,355 మంది సభ్యులున్న ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో రంగాల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ద్వారా అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. నూతన కార్యవర్గం 2027 వరకు విధుల్లో కొనసాగుతుంది.

కాగా, పోలింగ్ సమయంలో నిర్మాతలు యలమంచిలి రవిచంద్, అశోక్ కుమార్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. గుర్తింపు లేని, చనిపోయిన సభ్యుల ఓట్లను వినియోగించుకుంటున్నారని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఆరోపణలు వ‌చ్చాయి. వెంటనే దిల్ రాజు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది.


More Telugu News