లండన్ లో హిందూ నిరసనకారులను అడ్డుకున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు

  • బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువుల హత్యలపై నిరసన ప్రదర్శన
  • బంగ్లా హైకమిషన్ ముందు ఆందోళన చేపట్టిన హిందువులు
  • అడ్డుకుని భారత వ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు
లండన్ లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ లో ఇటీవల మైనారిటీ హిందువులపై మూకదాడులు, హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను నిరసిస్తూ లండన్ లోని హిందువులు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్ లోని మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన హిందువులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా... ఖలిస్థానీ వేర్పాటువాదులు దీనిని అడ్డుకున్నారు.

పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్దకు చేరుకుని భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భయాందోళనలు సృష్టించారు. ఖలిస్థానీ జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేశారు. రెండు గ్రూపులు పోటాపోటీగా నినాదాలు చేస్తుండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసను, మైనారిటీల హక్కుల కోసం గొంతెత్తుతున్న వారిని ఖలిస్థానీ అతివాదులు అడ్డుకోవడం షాక్ కు గురిచేసిందని హిందూ నిరసనకారులు ఆరోపించారు.


More Telugu News