జనవరి 3న కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కల్యాణ్

  • ఆలయం వద్ద భారీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కల్యాణ్
  • దీక్షా విరమణ మండపం, భారీ సత్రాల నిర్మాణాలకు భూమిపూజ చేయనున్న పవన్ 
  • టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో అభివృద్ధి పనులు
తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో సందర్శించనున్నారు. 2026 జనవరి 3వ తేదీ శనివారం ఆయన కొండగట్టును సందర్శించనుండటంతో ఈ పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా హనుమాన్ దీక్షలు చేపట్టే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే విధంగా దీక్షా విరమణ మండపం, ఆధునిక వసతులతో కూడిన సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమిపూజ చేయనున్నారు.

ఈ అభివృద్ధి పనులను టీటీడీ బోర్డు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షా విరమణ చేసేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. అలాగే, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలు కొండగట్టు ఆలయ చరిత్రలో భక్తుల సౌకర్యాల పరంగా కీలక మైలురాయిగా నిలవనున్నాయి.

పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక నిర్ణయాల ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సమయంలో పవన్ కల్యాణ్ కు భక్తులు సమస్యలు విన్నవించారు. ఆ నేపథ్యంలో టీటీడీ నిధుల ద్వారా ఇక్కడ సౌకర్యాల ఏర్పాటునకు హామీ ఇచ్చారు. టీటీడీ ద్వారా పవన్ నిధులు మంజూరు చేయించారు. ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో, టీటీడీ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరవడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

పవన్ కల్యాణ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, జనసేన కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. 


More Telugu News