వెంటనే రియాక్ట్ అయ్యారు... కాలిందా?: బీజేపీ నేత విష్ణు విమర్శలకు ప్రకాశ్ రాజ్ ఘాటు స్పందన

  • నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌పై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
  • ప్రకాశ్ రాజ్‌ను "అర్బన్ నక్సలైట్" అని విమర్శించిన ఏపీ బీజేపీ నేత
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఇద్దరి మాటల యుద్ధం
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తనపై విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సుదీర్ఘ విమర్శలకు ప్రతిస్పందనగా, ప్రకాశ్ రాజ్ కేవలం రెండే పదాలతో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "వెంటనే రియాక్ట్ అయ్యారు.. కాలిందా???" అంటూ ఆయన పోస్ట్ పెట్టారు.

నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రకాశ్ రాజ్‌ను 'అర్బన్ నక్సలైట్' అని సంబోధిస్తూ, సినిమా డైలాగులు చెప్పడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 2000 నుంచి 2025 మధ్య మావోయిస్టుల దాడుల్లో 2,722 మంది పోలీసులు చనిపోయినప్పుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పేద గిరిజనుల జీవితాలను నాశనం చేయడం ఆపాలని, దమ్ముంటే తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్లాలని సవాల్ విసిరారు. RSS పై ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలను కూడా విష్ణు తిప్పికొట్టారు.

అంతకుముందు ప్రకాశ్ రాజ్, నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. "వాళ్లు కూడా మన ప్రజలే కదా? వారితో మాట్లాడి జనజీవన స్రవంతిలో కలపాలి కానీ చంపడమేంటి?" అని వ్యాఖ్యానించారు. గొంతు విప్పితే ఈడీ దాడులు చేస్తున్నారని కూడా ఆరోపించారు. 


More Telugu News