జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని భార్యాభర్తలు మృతి

  • మెట్‌పల్లి-కోరుట్ల జాతీయ రహదారిలో లారీ, కారు పరస్పరం ఢీ
  • నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు మృతి
  • తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రికి తరలింపు
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మెట్‌పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై పెద్దగుండు ప్రాంతంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ తన భార్య లావణ్య, కుమార్తె కీర్తితో కలిసి కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం తిరిగి వెళుతుండగా వీరి కారు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కీర్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డిలో ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

సంగారెడ్డి జిల్లాలో ఆగి ఉన్న టిప్పర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మెదక్ నుంచి పటాన్‌చెరుకు ఆర్టీసీ బస్సు వెళుతుండగా కంది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.


More Telugu News