రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత విమర్శలు

  • ప్రభుత్వం మారినా ఇంకా సర్వేలే జరుగుతున్నాయని విమర్శ
  • అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలన్న కవిత
  • సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలే జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో 'జనం బాట' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన అని ఆరోపించారు. మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల భూమిని దళితుల నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్ కల్చర్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని ఆమె అన్నారు. దుందుభి నదిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీపోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలని ఆమె అభిప్రాయపడ్డారు. తాను సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించారని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. 

కాగా, కవిత తన పర్యటనలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News