అమ్మాయిలు, హీరోయిన్లు మీకు ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకోండి: నిర్మాత ఎస్కేఎన్

  • హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్కేఎన్ కౌంటర్
  • ఏ బట్టల సత్తిగాడి మాటలు వినవద్దని వ్యాఖ్యలు
  • అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవాలని సూచన
"అమ్మాయిలు, హీరోయిన్లు మీకు ఏ దుస్తులు సౌకర్యంగా, నమ్మకంగా అనిపిస్తే వాటినే ధరించండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన అవసరం లేదు" అని సినీ నిర్మాత ఎస్కేఎన్ అన్నారు. నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హీరోయిన్లు చీరలు ధరించాలని, అర్థనగ్న దుస్తులు ధరించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. యాంకర్ అనసూయ, గాయని చిన్మయి తదితరులు శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు.

'పతంగ్' చిత్రం సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్... శివాజీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఈ సినిమాలో ఇన్‌స్టాగ్రామ్ పాప్యులర్ ఇన్‌ఫ్లుయెన్సర్, తెలుగమ్మాయి ప్రీతి పగడాల కథానాయికగా నటించారు. సక్సెస్ మీట్‌కు ఆమె జీన్స్, టాప్ ధరిచి వచ్చారు. ఆ అమ్మాయిని చూసిన ఎస్కేఎన్, "ఏంటమ్మా మామూలు డ్రెస్ వేసుకొచ్చావ్, కొంచెం గ్లామర్‌గా రావొచ్చు కదా" అని వ్యాఖ్యానించారు.

ఏ బట్టల సత్తిగాడి మాటలు వినవద్దని, అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ డ్రెస్ వేసుకుంటే బావుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే మరేమో అయిపోతారని లేదని, నమ్మకం అంతా మన హృదయంలో ఉంటుందని అన్నారు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే బాగా ఉంటామని, మన ఆలోచనలు మంచివైతే మంచి జరుగుతుందని అన్నారు. దుస్తుల్లో ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు.


More Telugu News