ప్రజల కోరిక మేరకు... జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

  • జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • జిల్లాల పునర్విభజనపై ప్రజాభిప్రాయాలకు పెద్దపీట
  • అభ్యంతరాలు, సూచనల స్వీకరణ తర్వాత స్వల్ప మార్పులు
  • గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయం
  • డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీకి సీఎం ఆదేశం
  • పలు జిల్లాలు, డివిజన్ల సరిహద్దుల్లో కీలక మార్పులు చేర్పులు
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని, కొన్ని స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 31వ తేదీన జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు పలు మార్పులతో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెల రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు అందాయి. ఈ నేపథ్యంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం, ప్రజాభీష్టానికి అనుగుణంగా కొన్ని ముఖ్యమైన మార్పులకు ఆమోదం తెలిపింది.

నెల్లూరు జిల్లాలోనే గూడూరు.. కీలక నిర్ణయాలు ఇవే..

ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన డిమాండ్‌ను గౌరవిస్తూ, గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వానికి ప్రజాభిప్రాయంపై ఉన్న గౌరవాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

అదేవిధంగా, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ స్థానంలో అడ్డరోడ్డు జంక్షన్‌ను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో, అచ్యుతాపురం మండలాన్ని కొత్తగా ఏర్పడనున్న అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చనున్నారు. మార్కాపురం జిల్లా పరిధిలోకి దొనకొండ, కురిచేడు మండలాలను తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. 

రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లా విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకారమే యధావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు.

విస్తీర్ణంలో చాలా పెద్దదిగా ఉన్న ఆదోని పట్టణాన్ని రెండు మండలాలుగా విభజించాలనే ప్రతిపాదనపై కూడా సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కలపడంపై చర్చ జరిగినప్పటికీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రాథమిక నోటిఫికేషన్‌ మేరకు ఈ ప్రాంతాలు యథావిధిగానే...

• శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చడం

• అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు మార్చడం.

• కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు మార్చడం

• అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయడం

• కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు... ప్రకాశం జిల్లాలో విలీనం

• కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు... కందుకూరు డివిజన్‌లోని మిగిలిన రెండు మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లోకి మార్పు...

• పలమనేరు డివిజన్‌లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్‌కు మార్పు

• చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్చడం

• చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌కు మార్పు

• శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

• కదిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆమదగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం

• పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. 

ఈ మార్పుచేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



More Telugu News