అనంతపురం జిల్లా కలెక్టర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం

  • సుబ్బరాయ సాగర్ కు వెంటనే నీటిని విడుదల చేయాలన్న జేసీ
  • పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన
  • పెనకచర్ల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలని విన్నపం

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పుట్లూరు మండల రైతుల సమస్యలను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరాయ సాగర్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.


జిల్లా కలెక్టర్‌ ను కలిసిన అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం సుబ్బరాయ సాగర్‌లో సుమారు 11.4 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే గేట్లు తెరుచుకోకపోవడం వల్ల 29వ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుంచి బొప్పేపల్లి చెరువుకు నీటిని మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో పుట్లూరు మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులు నీటితో నిండకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జేసీ పేర్కొన్నారు. సాగునీరు అందక పంటలపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.


ప్రస్తుతం సుబ్బరాయ సాగర్ గేట్లకు అవసరమైన మరమ్మత్తులు పూర్తయ్యాయని, ఇక ఆలస్యం చేయకుండా పెనకచర్ల డ్యామ్ నుంచి సుబ్బరాయ సాగర్‌కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. నీరు విడుదల చేయకపోతే పుట్లూరు మండల రైతులు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


ఈ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రైతుగా కలెక్టర్‌ను కలిశానని, ఈ అంశాన్ని దయచేసి రాజకీయంగా మలచొద్దని కోరారు. పుట్లూరు మండలంలో తనకు స్వంత భూమి ఉందని, రైతుల బాధ తనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీతో పుట్లూరు మండల రైతుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది.



More Telugu News