పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు: జార్జ్ బుష్ హయాంలోనే ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్

  • 2001-2008 మధ్య పుతిన్, జార్జ్ బుష్ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ బహిర్గతం
  • పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన ఒక సైనిక కూటమని బుష్‌తో పేర్కొన్న పుతిన్
  • పాకిస్థాన్‌పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించిన పుతిన్ 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌ల మధ్య 2001 నుంచి 2008 మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ ఆ వివరాలను బహిర్గతం చేసింది. పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని అణు కార్యక్రమాన్ని ఆనాడు పుతిన్, జార్జ్ డబ్ల్యూ బుష్ తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ వివరాల ద్వారా తెలుస్తోంది.

పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన ఒక సైనిక కూటమి అని పుతిన్ ఒకసారి నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారని ఇది వెల్లడిస్తోంది. 2001లో స్లొవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, బుష్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే పాక్ అణ్వాయుధాల అంశంపై వీరిరువురూ చర్చించారు. అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా పాకిస్థాన్‌పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని పుతిన్ ప్రశ్నించారు.

పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి అని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని, మిలిటరీ పాలన ఉందని పుతిన్ పేర్కొన్నారు. కానీ పశ్చిమ దేశాలు పాకిస్థాన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన అన్నారు. ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ అణ్వాయుధాల పట్ల ఉదాసీనంగా ఉండటంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

పుతిన్ వ్యాఖ్యలతో బుష్ ఏకీభవించారు. అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు బుష్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంలో పాకిస్థాన్ యూరేనియాన్ని గుర్తించినట్లు 2005లో జరిగిన మరో సమావేశంలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించారు. పాకిస్థాన్ అక్రమ వ్యాపారం కలవరపరిచే అంశమేనని బుష్ కూడా అంగీకరించారు.

అన్ని రకాలుగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రమాదకర పదార్థం చేతులు మారడంపై బుష్, పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దానిని బుష్ కూడా సమర్థించినట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయి.


More Telugu News