రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి తోలు తీస్తారు?: హరీశ్ రావు
- అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేక పోతున్నారన్న హరీశ్ రావు
- ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని వ్యాఖ్య
- విద్యార్థుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్ధిపేటలో అనాథ విద్యార్థులను కలిసిన హరీశ్ రావు, వారి సమస్యలు తెలుసుకున్నారు.
గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు, కాస్మటిక్ చార్జీలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని హరీశ్ గుర్తు చేశారు. ప్రభుత్వం కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తోందని, కమీషన్ లేని పనులను కావాలని ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపించారు. “విద్యార్థులు కమీషన్లు ఇవ్వలేరు కాబట్టే వారి బిల్లులు చెల్లించడం లేదేమో” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
విద్యార్థుల బిల్లుల విషయంలో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పారని, కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని మండిపడ్డారు. “మాటలు మాత్రం ఆకాశాన్ని తాకుతాయి... చేతలు మాత్రం గడప కూడా దాటవు” అంటూ సీఎం పనితీరును ఎద్దేవా చేశారు.
“నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే విద్యాశాఖ మంత్రివి… అయినా విద్యార్థుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఇంకెవరిని అడగాలి?” అని హరీశ్ ప్రశ్నించారు. బిల్లులు చెల్లించకపోతే తోలు తీస్తానని గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ తోలు ఎవరి మీద తీస్తారని నిలదీశారు.
ప్రభుత్వం తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెరుగుతోందని హెచ్చరించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. విద్యార్థుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని... లేకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. విద్య, సంక్షేమ రంగాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.