రేవంత్ రెడ్డి భాషపై హరీశ్ రావు వ్యాఖ్యలు.. స్పందించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

  • రాజకీయాల్లో తిట్ల పురాణాన్ని ప్రారంభించిందే కేసీఆర్ అన్న చామల
  • ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేసీఆర్ 'తోలు తీస్తా' అంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • కేసీఆర్ పద్ధతిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి అంతే పద్ధతిగా సమాధానం చెబుతారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సరిగాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. రాజకీయాల్లో తిట్ల పురాణానికి ఆద్యుడు కేసీఆరేనని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి 'తోలు తీస్తా' అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేసీఆర్ పద్ధతిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి అంతే పద్ధతిగా సమాధానం చెబుతారని, అభ్యంతరకర భాషను ఉపయోగిస్తే అదే పద్ధతిలో బదులిస్తారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లకు హరీశ్ రావు నీతులు చెప్పాలని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. నీతులు ఎదుటివారికే తప్ప తమకు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు.

తొలుత కేసీఆర్ మాట్లాడే భాషను ఒకసారి పరిశీలించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ తిట్ల పురాణం ప్రారంభించారని, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా అదే భాషను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పదేళ్ల అవినీతిపై చర్చించాలని సవాల్ విసిరారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని సూచిస్తున్నారని, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్పాలని కోరారు.


More Telugu News