కర్ణాటకలో పెను విషాదం: లారీ-బస్సు ఢీ.. మంటల్లో చిక్కుకుని 13 మంది సజీవ దహనం!

  • ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన
  • సుమారు 30 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న బస్సు
  • గోర్లట్టు వద్ద ఎదురుగా వచ్చి బలంగా ఢీకొన్న లారీ
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కర్ణాటకలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదవగా.. ప్రాథమిక సమాచారం ప్రకారం 13 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.

బెంగళూరు నుంచి గోకర్ణకు సుమారు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు.. హెబ్బులి హైవేపై హిరియూర్ సమీపంలోని గోర్లట్టు వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

లారీ ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే వాహనం మొత్తం వ్యాపించాయి. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News