ముఖ్యమంత్రి మార్పా, ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది?: డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడి
  • మీడియాలో మాత్రమే ఊహాగానాలు వస్తున్నాయన్న శివకుమార్
  • పార్టీలో లేదా ప్రభుత్వంలో 'మార్పు'పై ఎలాంటి చర్చ లేదని స్పష్టీకరణ
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు, ముఖ్యమంత్రి పదవి అంశంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం గమనార్హం.

"అసలు ఈ ఊహాగానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీడియాలో మాత్రమే ఈ ప్రచారం జరుగుతోంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో ఎక్కడా ఎటువంటి ప్రచారం జరగడం లేదు" అని న్యూఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

మిగతా రెండున్నరేళ్లు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడం మీకు సమ్మతమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, పార్టీలో పదవుల కంటే కార్యకర్తగా ఉండటమే తనకు సంతోషమని పేర్కొన్నారు. కార్యకర్త అనేది తనకు శాశ్వత పదవి అని, 1980 నుండి కార్యకర్తగా ఉన్నానని, భవిష్యత్తులోనూ కొనసాగుతానని అన్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో తమ పార్టీకి చెందిన కీలక నాయకులు ఎవరూ లేరని, అందుకే కలవడం లేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ఉండగా, రాహుల్ గాంధీ పర్యటన ముగించుకుని వచ్చారని, కాబట్టి ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని తెలిపారు.

ముఖ్యమంత్రిగా తానే పూర్తి కాలం కొనసాగుతానని సిద్ధరామయ్య ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇలాంటి సమయంలో శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


More Telugu News