బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. 17 ఏళ్ల తర్వాత ఢాకా వస్తున్న మాజీ ప్రధాని కుమారుడు

  • 17 ఏళ్లుగా లండన్ నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని నడుపుతున్న తారిఖ్ రెహమాన్
  • మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్
  • పలు కేసుల్లో నిర్దోషిగా తేలడంతో బంగ్లాదేశ్ వస్తున్న తారిఖ్ రెహమాన్
  • వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం
బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 17 ఏళ్లుగా లండన్‌లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ గురువారం ఢాకాకు రానున్నారు. ఆయన మాజీ ప్రధాని ఖలీదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ కుమారుడు.

తారిఖ్ రెహమాన్ గురువారం ఢాకా చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. రెహమాన్ తన భార్య జుబైదా రెహమాన్, కుమారుడు జైమా రెహమాన్‌తో కలిసి బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్‌లో లండన్‌లోని హిత్రో విమానాశ్రయం నుంచి రేపు బయలుదేరుతారు. ఢాకా చేరుకున్న అనంతరం ఆయన పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి కాసేపు మాట్లాడుతారు.

ఆ తర్వాత ఢాకాలోని ఎవర్‌కేర్ హాస్పిటల్‌లోని సీసీయూలో చికిత్స పొందుతున్న తన తల్లి, బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖలీదా జియాను కలుస్తారు. తారిఖ్ రెహమాన్ ఈ నెల 27న రిజిస్టర్డ్ ఓటరుగా నమోదు చేసుకోవడానికి లాంఛనాలు కూడా పూర్తయ్యాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలమ్ మాట్లాడుతూ, రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని పేర్కొన్నారు. బీఎన్‌పీని సంప్రదించి, ఆ పార్టీ కోరినట్లు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ ప్రాంతంతో పాటు ఉత్తర, దక్షిణ జిల్లాల నుండి 1,00,000 మందికి పైగా బీఎన్‌పీ మద్దతుదారులు రెహమాన్‌కు స్వాగతం పలకడానికి ఢాకాకు వస్తున్నారని తెలుస్తోంది. 2004లో గ్రెనేడ్ దాడితో పాటు పలు కేసులలో రెహమాన్ ఇటీవల నిర్దోషిగా తేలారు. ఈ కేసుల నేపథ్యంలోనే ఆయన ఇప్పటి వరకు లండన్ నుంచి పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడు ఆ కేసుల్లో నిర్దోషిగా తేలడంతో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నారు.


More Telugu News