పీపీపీ విధానంపై వెనక్కి తగ్గేదేలేదు: సీఎం చంద్రబాబు

  • పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీ లేదన్న సీఎం 
  • పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణమంటూ స్పష్టీక‌ర‌ణ‌
  • వీజీఎఫ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 30 శాతం ఆర్థిక సాయం
  • ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందానికి ఆదేశం
  • చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు విస్తరించాలని సూచన
పేదలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోనే వైద్య కళాశాలల నిర్మాణం చేపడతామని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇవాళ‌ వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పీపీపీలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్
పీపీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పథకం కింద వైద్య రంగంలోని ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 60 శాతం వరకు ఆర్థిక మద్దతు లభిస్తుందని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 30 శాతం వాటాను భరిస్తాయని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ వీజీఎఫ్ అమలు చేయాలని సీఎం సూచించారు.

ఆదోని మెడికల్ కాలేజీకి సంస్థ ఖరారు 
రాష్ట్రంలో తొలి విడతగా ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఒక సంస్థ ముందుకు రాగా, ఆ సంస్థతో వెంటనే ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన కళాశాలల టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష
ఈ సమావేశంలో కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన "సంజీవని"పైనా సీఎం సమీక్షించారు. కుప్పంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, త్వరలోనే ఈ ప్రాజెక్టును చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


More Telugu News