కూటమి చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆర్బీఐ డేటా చెబుతోంది: జగన్

  • తమ పాలనపై టీడీపీ-జనసేన అబద్ధాలు చెబుతోందన్న జగన్
  • ఆర్బీఐ లెక్కల ప్రకారం పారిశ్రామిక వృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉందని వెల్లడి
  • పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంబటి రాంబాబు
  • మెడికల్ కాలేజీల స్కామ్ భయంతోనే పవన్ వ్యాఖ్యలని ఆరోపణ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ఐదేళ్ల పాలనలో (2019-24) పారిశ్రామిక రంగంలో రాష్ట్ర పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాలతో, కూటమి నేతల అబద్ధాలు బట్టబయలయ్యాయని తెలిపారు.

'ఎక్స్' వేదికగా స్పందించిన జగన్, వైసీపీ ప్రభుత్వం 'బ్రాండ్ ఏపీ'ని నాశనం చేసిందని, పెట్టుబడిదారులను తరిమేసిందని టీడీపీ-జనసేన నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఆరోపణల్లో కొంచెమైనా నిజం ఉండి ఉంటే పారిశ్రామిక రంగంలో ఏపీ పనితీరు దారుణంగా ఉండేదని, కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. 

ఆర్బీఐ లెక్కల ప్రకారం 2019-24 మధ్య తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో, దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. అలాగే, పారిశ్రామిక వృద్ధిలో కూడా దక్షిణాన మొదటి స్థానంలో, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. "ఇది బ్రాండ్ ఏపీని నాశనం చేయడమా? లేక పరివర్తనాత్మక నాయకత్వంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమా?" అని జగన్ ప్రశ్నించారు.

పవన్ రౌడీ భాష మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు

ఇదిలా ఉండగా, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ప్రసంగాలు దూకుడుగా, గందరగోళంగా ఉంటున్నాయని, ఆయన మాటలు ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పవన్ రౌడీ భాష మాట్లాడటం తగదని హితవు పలికారు. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌పై భయంతోనే పవన్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు ఈ కాలేజీలను తన అనుచరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని, ఈ వ్యవహారంలో పవన్‌కు కూడా వాటా ఉందేమోనన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.


More Telugu News