ఏసీబీ సోదాలు.. మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వద్ద రూ.36 కోట్ల ఆస్తుల గుర్తింపు

  • హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు
  • గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.36 కోట్లకు పైగా ఉంటుందని అంచనా
  • హోటళ్లు, స్థిర, చరాస్తులు, బ్యాంకులో కిలోన్నర బంగారం గుర్తింపు
మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ బోయినపల్లిలోని ఆర్ఆర్ నగర్‌లోని ఆయన నివాసంతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు.

గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.36 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్సులు, హోటళ్లు, స్థిర, చరాస్తులను గుర్తించారు. బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కిషన్ నాయక్ 2024 డిసెంబర్‌లో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.


More Telugu News