Viharika: ప్రేమ విఫలమై బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఇదే చివరి మెసేజ్ అంటూ వాట్సాప్ స్టేటస్

Viharika Commits Suicide After Love Failure in Hyderabad
  • హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఘటన
  • ప్రియుడు దూరం పెట్టడం, పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం
  • తమ్ముడి పుట్టిన రోజు వేడుకలు ముగిసిన అనంతరం ఆత్మహత్య
నవ్వుతూ తమ్ముడి పుట్టినరోజు వేడుకలు జరిపించింది.. అందరితో కలిసి కేక్ కట్ చేయించింది.. కానీ అంతలోనే ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. ప్రేమించిన వాడి నిరాకరణ, పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెందిన విహారిక (20) అనే బీటెక్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ముందు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన. 

స్వామిరెడ్డి నగర్‌కు చెందిన అశోక్-రూప దంపతుల కుమార్తె విహారికకు, కిషోర్ (32) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. అయితే, గత కొంతకాలంగా కిషోర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. విహారికను దూరం పెట్టడం, పెళ్లికి నిరాకరించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేకపోయిన విహారిక గత వారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తిరుపతిలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆమెను వెతికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఆదివారం రాత్రి విహారిక ఇంట్లో సందడి నెలకొంది. తన తమ్ముడి పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపింది. అయితే, ఆ సంతోషం వెనుక పెను విషాదం దాగుందని ఎవరూ ఊహించలేదు. అర్ధరాత్రి తమ్ముడితో కేక్ కట్ చేయించిన విహారిక 2 గంటల సమయంలో గదిలోకి వెళ్లి వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఆ తర్వాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కలచివేసిన చివరి సందేశం
‘‘సారీ మై బాయ్.. నీకు కావాల్సిన సంతోషాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను.. ఇదే నా చివరి మెసేజ్’’ అంటూ తన వాట్సాప్ స్టేటస్‌లో విహారిక పెట్టిన మెసేజ్ ఇప్పుడు పోలీసుల చేతిలో కీలక ఆధారంగా మారింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం వల్లే విహారిక ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Viharika
Viharika suicide
B.Tech student suicide
love failure suicide
Hyderabad suicide case
whatsapp status suicide
suicide message
Meerpet police
kishore arrest
telugu news

More Telugu News