Anil Ravipudi: అనిల్ రావిపూడి ప్రమోషన్ స్ట్రాటజీ మామూలుగా లేదు.. చిరు సినిమా కోసం ఏఐ టెక్నాల‌జీని వాడేశారు..!

Anil Ravipudi Uses AI for Chiranjeevi Movie Promotion
  • త‌న సినిమాల‌ ప్రమోషన్ల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడిది ప్ర‌త్యేక పంథా
  • ఇదే కోవ‌లో ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కోసం ఏఐ టెక్నాల‌జీతో ప్ర‌చారం
  • ఏఐతో ప్ర‌త్యేక ప్ర‌మోష‌న‌ల్ వీడియో రూపొందించి విడుద‌ల చేసిన డైరెక్ట‌ర్‌
  • నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియో.. మెగా అభిమానులు ఫుల్ ఖుషీ
త‌న సినిమాల‌ ప్రమోషన్ల విషయంలో యువ‌ దర్శకుడు అనిల్ రావిపూడి ప్ర‌త్యేక పంథాలో వెళుతుంటార‌నే విష‌యం తెలిసిందే. ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు పూర్తిగా భిన్నంగా ఆయ‌న ప్ర‌మోష‌న్ ఉంటుంది. సరికొత్త ఐడియాలతో ప్ర‌మోష‌న్స్ చేస్తూ, త‌న మూవీని విడుదలకు ముందే జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం అతడి ప్ర‌త్యేక‌త‌. త‌ద్వారా రిలీజ్‌కి ముందే అనిల్ మూవీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 

ఇప్పుడు ఇదే కోవ‌లో అనిల్ తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మూవీని కూడా స‌రికొత్త‌గా ఏఐ టెక్నాల‌జీ ద్వారా ప్ర‌చారానికి తెర‌లేపారు. ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌స్తున్న‌ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ప్ర‌క‌ట‌న‌ దగ్గర నుంచే  అనిల్ వరుసగా క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోలు విడుద‌ల‌ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనిల్ రావిపూడి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి… ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు” అంటూ అనిల్ ఎక్స్ వేదిక‌గా షేర్ చేసిన ఈ వీడియో మెగా అభిమానుల‌ను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరంజీవి కెరీర్‌లోని క్లాసిక్ చిత్రాలైన‌ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ముఠామేస్త్రీ, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్ వంటి చిత్రాల సెట్స్‌కు అనిల్ వెళ్లినట్టుగా ఏఐ వీడియోను రూపొందించారు. మెగాస్టార్‌తో కలిసి ఉన్నట్టుగా చూపిస్తూ తన అభిమానాన్ని వినూత్నంగా ఆవిష్కరించారు. 

వింటేజ్ మెగాస్టార్‌ను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ వీడియో ప్ర‌స్తుతం మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తోంది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియోపై అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. "అనిల్ ప్రమోషన్ స్ట్రాటజీ మామూలుగా లేదు.. సినిమా కోసం ఏదీ వదలడం లేదుగా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఈ స్పెష‌ల్ వీడియోపై ఓ లుక్కేయండి. 
Anil Ravipudi
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
AI Technology
Movie Promotion
Tollywood
Sankranthi Release
Artificial Intelligence
Mega Star
Vintage Chiranjeevi

More Telugu News