Jupally Krishna Rao: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao Alleges BRS BJP Alliance in Panchayat Elections
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండమని కేటీఆర్ చెప్పారని గుర్తు చేసిన మంత్రి
  • బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలి ఉందని ఎద్దేవా
  • బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శ
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేశాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలవలేకపోయాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రెండేళ్ల పాలనకు రెఫరెండమని స్వయంగా కేటీఆర్ పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు సరికాదని ఆయన అన్నారు.

గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల తర్వాత అధికారంలోకి రాగానే తోలు తీస్తానని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఆ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బలహీనపడిందని, పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలనే విషయం కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. కేసీఆర్ బయటకు వచ్చింది పాలమూరు ప్రాజెక్టు గురించి కాదని, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠ కోసమని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. 2023 ఎన్నికల సమయంలో ఒక మోటార్ ఆన్‌చేసి పాలమూరు ప్రాజెక్టు జాతికి అంకితమని చెప్పారని, కానీ నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండానే ఆ పని చేశారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు తీసుకుంటేనే మన నీళ్లు మనం వాడుకునే పరిస్థితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Jupally Krishna Rao
Telangana
BRS
BJP
Panchayat Elections
KCR
KTR
Congress
Palamuru Project

More Telugu News