V Narayanan: ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ప్రయోగం ముంగిట తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

V Narayanan ISRO Chairman Visits Tirumala Ahead of Bluebird Block 2 Launch
  • కీలక ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
  • డిసెంబర్ 24న LVM3-M6 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
  • అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో
  • సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా 4G/5G సేవలు అందించడమే లక్ష్యం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టే ప్రతి కీలక ప్రయోగానికి ముందు దైవ దర్శనం చేసుకోవడం దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈ ఆనవాయతీని కొనసాగిస్తూ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు, లాంచ్ టీమ్ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.

డిసెంబర్ 24న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టనున్న LVM3-M6 మిషన్ విజయవంతం కావాలని కోరుతూ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వాణిజ్య ప్రయోగంలో భాగంగా, ఇస్రో తన హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్ LVM3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన ‘ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్’ సంస్థ అభివృద్ధి చేసిన ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది.

ఈ శాటిలైట్ ప్రయోగం ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకే హై-స్పీడ్ సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం. దీని ద్వారా 4G/5G వాయిస్, మెసేజింగ్, స్ట్రీమింగ్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
V Narayanan
ISRO
Bluebird Block 2
LVM3-M6 Mission
Sriharikota
Satish Dhawan Space Centre
AST SpaceMobile
Low Earth Orbit
Satellite Launch
Tirumala

More Telugu News