ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం.. ట్రంప్ ఫొటో తొలగింపుపై దుమారం!

  • అమెరికాను కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్
  • సాక్ష్యాధారాలుగా ఉన్న ఫొటోల నుంచి ట్రంప్ చిత్రాలు మాయం
  • ట్రంప్ ఫొటోల తొలగింపుపై నిప్పులు చెరుగుతున్న డెమోక్రాట్లు
  • ట్రంప్ ఫోటోలే కాకుండా, దాదాపు 16 కీలక ఫైల్స్ వెబ్‌సైట్ నుంచి మాయమయ్యాయంటూ కథనాలు
అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్ ఫైల్స్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న ఫోటోల నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలను అమెరికా న్యాయ శాఖ (DoJ) తొలగించడం, ఆపై తీవ్ర నిరసనల మధ్య వాటిని మళ్లీ పునరుద్ధరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ దర్యాప్తు ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఎప్‌‌స్టీన్ డెస్క్ మీద ఉన్న ఒక ఫోటోలో ట్రంప్ ఒక మహిళా బృందంతో కలిసి ఉండగా, మరో ఫోటోలో తన భార్య మెలానియా, ఎప్‌స్టీన్, అతడి సహచరి గిస్లైన్ మాక్స్‌వెల్‌తో కలిసి ఉన్నారు. అయితే, ఈ ఫోటోలను న్యాయ శాఖ హఠాత్తుగా వెబ్‌సైట్ నుంచి తొలగించింది.

ట్రంప్ ఫోటోలను తొలగించడంపై డెమొక్రాట్లు నిప్పులు చెరిగారు. "డొనాల్డ్ ట్రంప్ తన గురించి లేదా తన కుటుంబం, స్నేహితుల గురించి బయటకు రాకూడదనుకునే విషయాలను కప్పిపుచ్చేందుకే ఇలా చేస్తున్నారు" అని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు జేమీ రాస్కిన్ ఆరోపించారు. రిపబ్లికన్ సభ్యుడు థామస్ మాస్సీ కూడా ఈ చర్యను తప్పుబడుతూ, చట్టం ప్రకారం అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ దుమారంపై స్పందించిన న్యాయ శాఖ, బాధితుల గుర్తింపును కాపాడాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటోలను తాత్కాలికంగా తొలగించి సమీక్షించామని తెలిపింది. "ఆ ఫోటోలలో ఎప్‌స్టీన్ బాధితులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత, ఎటువంటి మార్పులు లేకుండా వాటిని మళ్లీ వెబ్‌సైట్‌లో ఉంచాం" అని న్యాయ శాఖ స్పష్టం చేసింది.

కేవలం ట్రంప్ ఫోటోలే కాకుండా, దాదాపు 16 కీలక ఫైల్స్ వెబ్‌సైట్ నుంచి కనిపించకుండా పోయాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వీటిలో ఎప్ స్టీన్ ఇంట్లోని కొన్ని అశ్లీల చిత్రాలు, నోట్‌బుక్ పేజీలు ఉన్నట్లు తెలుస్తోంది.  


More Telugu News