Vadlakonda Sriharsha: అప్పులు ఇప్పించిన పాపానికి నిండు సంసారం బలి.. సిద్దిపేటలో దంపతుల ఆత్మహత్య

Siddipet Couple Suicide Family Ends Life Over Loan Issues
  • బెజ్జంకిలో బట్టలషాపు నిర్వహిస్తున్న దంపతులు
  • మధ్యవర్తిగా ఉండి స్నేహితులకు రూ.13 లక్షల అప్పులు ఇప్పించిన శ్రీహర్ష
  • తీసుకున్న వారు చెల్లించకపోవడంతో ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి
  • వేధింపులు పెరగడంతో పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
  • అనాథగా మారిన మూడేళ్ల చిన్నారి హరిప్రియ
మధ్యవర్తిత్వం వహించి అప్పులు ఇప్పించిన పాపానికి ఒక నిండు సంసారం బలైంది. అప్పు తీర్చాల్సిన వారు ముఖం చాటేయడం, ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన దంపతులు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగిందీ ఈ విషాద ఘటన. 

దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి (25) దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. శ్రీహర్ష తనకు తెలిసిన స్నేహితులు, పరిచయస్తులకు మధ్యవర్తిగా ఉండి సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు ఇప్పించారు. అయితే, అప్పు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అసలు సమస్య మొదలైంది. డబ్బు ఇచ్చిన వారు శ్రీహర్షపై ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడంతో దిక్కుతోచని స్థితిలో దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.

చిన్నారి కేకలతో వెలుగులోకి..
ఆదివారం తెల్లవారుజామున దంపతులిద్దరూ ఇంట్లోనే పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూసి మూడేళ్ల చిన్నారి హరిప్రియ భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఇంటి యజమాని అప్రమత్తమయ్యారు. పోలీసుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రుక్మిణి అప్పటికే మృతి చెందగా, శ్రీహర్షను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారికి కూడా విషం ఇచ్చారేమో అన్న అనుమానంతో వైద్య పరీక్షలు చేయించగా, పాప క్షేమంగా ఉందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సూసైడ్ నోట్‌లో ఐదుగురి పేర్లు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రవీందర్‌రెడ్డి.. శ్రీహర్ష రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కారణమైన ఐదుగురి పేర్లను ఆయన ఆ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. అప్పుల వేధింపులే ఈ దారుణానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.

ఒకే చితిపై దంపతుల అంత్యక్రియలు
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన దాచారంలో శ్రీహర్ష, రుక్మిణి దంపతుల మృతదేహాలకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. కళ్ల ముందే తిరుగాడిన దంపతులు విగతజీవులుగా పడి ఉండటం, తల్లిదండ్రులు లేని చిన్నారిని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు.
Vadlakonda Sriharsha
Sriharsha
Siddipet
Bejjanki
Couple Suicide
Debt Pressure
Loan Issues
Family Tragedy
Andhra Pradesh News
Telangana News

More Telugu News