రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం'.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి

  • శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'ఎట్ హోం'
  • సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు
  • పలువురు రాజకీయ, పౌర ప్రముఖులకు రాష్ట్రపతి ఆతిథ్యం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తేనీటి విందుకు తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఏటా చేపట్టే శీతాకాల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేశారు.

ప్రతి ఏటా శీతాకాల పర్యటన సందర్భంగా రాష్ట్రపతి హైదరాబాద్ రావడం ఆనవాయతీ. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో కలిసి 'ఎట్ హోం' కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌కు 'ప్రెసిడెంట్స్ కలర్స్' ప్రదానం చేయడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తన పర్యటన ముగింపులో భాగంగా రాష్ట్ర ప్రముఖులకు ఈ విందును ఏర్పాటు చేశారు. ఈ ఎట్ హోం కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు.


More Telugu News