మలయాళ సినీ దిగ్గజం శ్రీనివాసన్ కన్నుమూత

  • గుండె జబ్బుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసన్ మృతి
  • 225కు పైగా చిత్రాల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
  • నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగా చెరగని ముద్ర
ప్రముఖ మలయాళ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన... త్రిపుణితురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసన్‌కు భార్య విమల, ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు. వీరిద్దరూ మలయాళ చిత్ర పరిశ్రమలో నటులుగా, దర్శకులుగా రాణిస్తుండటం గమనార్హం.

శ్రీనివాసన్ సినీ ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగింది. తన కెరీర్ లో ఆయన 225కి పైగా చిత్రాల్లో నటించారు. తనదైన ప్రత్యేక నటన, సామాజిక అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించే హాస్యంతో మలయాళ సినిమాపై చెరగని ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగానూ ఆయన పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు.

ఆయన కలం నుంచి 'సందేశం', 'నడోడికాట్టు', 'తలయానమంత్రం' వంటి ఎన్నో అద్భుతమైన కథలు జాలువారాయి. 'వడక్కునోక్కియంత్రం', 'చింతావిష్టయాయ శ్యామల' చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన ప్రతిభకు గుర్తింపుగా ఆరు కేరళ రాష్ట్ర అవార్డులతో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. శ్రీనివాసన్ మృతి వార్తతో మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.


More Telugu News