కబీర్ ఖాన్ పోస్ట్‌కు స్పందించిన స్మృతి మంధాన... చిన్నారి ఫ్యాన్‌పై ప్రేమ కురిపించిన క్రికెటర్

  • కశ్మీర్‌లో తనను కలిసిన స్మృతి అభిమాని గురించి పోస్ట్ చేసిన కబీర్ ఖాన్
  • ఆ పాపకు స్మృతి ఫేవరెట్ ప్లేయర్ అని తన పోస్ట్‌లో పేర్కొన్న దర్శకుడు
  • కబీర్ ఖాన్ పోస్ట్‌పై స్పందించి చిన్నారికి ప్రేమను పంపిన స్మృతి
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్‌కు కశ్మీర్ పర్యటనలో ఒక మధురమైన అనుభవం ఎదురైంది. తన కెమెరాతో కశ్మీర్ అందాలను బంధిస్తున్న ఆయనకు లోయలో అరు అనే ఓ చిన్నారి తారసపడింది. ఆ పాప భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు పెద్ద అభిమాని అని, స్మృతి తన ఫేవరెట్ ప్లేయర్ అని ఆమెకు చెప్పమని కబీర్ ఖాన్‌ను కోరింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

"కశ్మీర్‌లో కెమెరాతో తిరుగుతున్నప్పుడు నాకు ఇలాంటి మ్యాజికల్ మూమెంట్స్ దొరుకుతాయి. అరు అనే ఈ చిన్నారి తన ఫేవరెట్ ప్లేయర్ స్మృతి మంధాన అని చెప్పమంది. ఈ పోస్ట్ స్మృతి చూస్తుందని ఆశిస్తున్నాను" అని కబీర్ ఖాన్ రాశారు. అక్కడే కొందరు పిల్లలు పర్వతాల మధ్య ఉన్న వాగును బౌండరీగా చేసుకొని క్రికెట్ ఆడుతున్న ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. కబీర్ ఖాన్ ఆశించినట్లే ఈ పోస్ట్ స్మృతి మంధాన దృష్టికి వెళ్లింది. ఆమె వెంటనే స్పందిస్తూ "దయచేసి అరులోని ఆ చిన్నారి ఛాంప్‌కు నా తరఫున ఒక పెద్ద హగ్ ఇవ్వండి. నేను కూడా తనకోసం ఎదురుచూస్తానని చెప్పండి" అని కామెంట్ చేశారు.

మరోవైపు, తాను దర్శకత్వం వహించిన 'చందు ఛాంపియన్' చిత్రంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్‌కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రావడంపై కబీర్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. "ఒక నటుడి కఠోర శ్రమ, అంకితభావం అంటే ఇదే. ఈ పాత్రకు కార్తీక్ పూర్తి న్యాయం చేశాడు. కమర్షియల్ విజయాలతో పాటు నటుడిగా సవాళ్లను స్వీకరించే అరుదైన కలయిక కార్తీక్" అని ఆయన ప్రశంసించారు.


More Telugu News