నిజాంపేటలో హైడ్రా ఆపరేషన్.. రూ.1,300 కోట్ల విలువైన 13 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

  • నిజాంపేటలో 13 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ
  • రూ. 1,300 కోట్ల విలువైన స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
  • తాత్కాలిక కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు
  • రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు కబ్జాలకు అడ్డుకట్ట
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, బాచుపల్లి మండలం పరిధిలోని నిజాంపేటలో సుమారు రూ.1,300 కోట్ల విలువైన 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు శుక్రవారం కాపాడారు. కబ్జాదారుల బారి నుంచి భూమిని రక్షించి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళితే... నిజాంపేట గ్రామంలోని సర్వే నంబర్లు 186, 191, 334లలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని బాచుపల్లి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొంత భూమి అన్యాక్రాంతమైందని, మిగిలిన స్థలానికైనా వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బందితో కలిసి హైడ్రా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాయి.

సర్వే నంబర్ 334లో ఇప్పటికే 4 ఎకరాల భూమిలో శాశ్వత నివాసాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిర్మాణాల జోలికి వెళ్లకుండా, మిగిలిన 13 ఎకరాల స్థలంలో ఉన్న తాత్కాలిక షెడ్లను తొలగించారు. అనంతరం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ స్థలమంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.


More Telugu News