Singapore Government: సింగపూర్‌లో మోసం చేస్తే ఇక కొరడా దెబ్బల శిక్ష.. ఎప్పటి నుంచి అంటే?

Singapore Government to Impose Caning for Fraud from December 30
  • మోసాలను అరికట్టేందుకు చట్టంలో మార్పులు చేసిన సింగపూర్ ప్రభుత్వం
  • ఈ డిసెంబర్ 30 నుంచి అమలులోకి కొరడా దెబ్బల శిక్ష
  • మోసాన్ని బట్టి 6 నుంచి 24 వరకు కొరడా దెబ్బలు
పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం చట్టంలో కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం, మోసాలకు పాల్పడిన వారికి శిక్షగా కొరడా దెబ్బలు విధించనుంది. ఇది డిసెంబర్ 30వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. గత నెలలో పార్లమెంటు ఈ మార్పులను ఆమోదించింది.

దేశంలో మోసపూరిత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టడానికి నిబంధనల్లో మార్పులు చేసినట్లు సింగపూర్ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్కామర్లు, వారిని నియమించుకునేవారు, ఆయా ముఠాల్లో ఉన్న వ్యక్తులకు కొరడా దెబ్బల శిక్షను విధించనున్నట్లు తెలిపింది.

స్కాములను ఎదుర్కోవడం జాతీయస్థాయిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని, ఇటువంటి కేసులు, వీటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. స్కామర్లకు కనీసం ఆరు కొరడా దెబ్బల శిక్ష విధించనున్నట్లు వెల్లడించింది. సిమ్ కార్డులు సమకూర్చడం, సింగపూర్ ఐడీలు స్కామర్లతో పంచుకునే వారికి 12 కొరడా దెబ్బలు విధించే అవకాశం ఉంది. మోసాల తీవ్రతను బట్టి గరిష్ఠంగా 24 కొరడా దెబ్బలు విధించనున్నారు.

2020 నుంచి 2025 జూన్ మధ్య సింగపూర్‌లో నమోదైన మొత్తం నేరాలలో స్కామ్‌లు 60 శాతం ఉన్నాయని హోం వ్యవహారాలు మరియు విదేశాంగ శాఖ సీనియర్ సహాయ మంత్రి సిమ్ ఆన్ పార్లమెంటుకు తెలిపారు. ఆ కాలంలో దాదాపు 1,90,000 స్కామ్ కేసులు దాదాపు 3.7 బిలియన్ సింగపూర్ డాలర్ల నష్టాన్ని కలిగించాయని చెప్పారు. సింగపూర్ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, టాప్-5 స్కామ్‌లలో ఫిషింగ్, మోసపూరిత ఉద్యోగాలు, ఈ-కామర్స్ అండ్ ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడుల స్కాం, చీటింగ్ ఉన్నాయి.
Singapore Government
Singapore scams
fraud
scams
Singapore law
Singapore punishment

More Telugu News