Under-19 Asia Cup: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్... టైటిల్ కోసం పాక్ తో అమీతుమీ

Under19 Asia Cup India Qualifies for Final Against Pakistan
  • అండర్-19  ఆసియా కప్ సెమీస్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
  • విహాన్, ఆరోన్ జార్జ్ అజేయ హాఫ్ సెంచరీలు
  • వర్షం కారణంగా మ్యాచ్‌ 20 ఓవర్లకు కుదింపు
  • ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడనున్న యువ భారత్
అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన సెమీఫైనల్ మ్యాచ్‌లో, శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విహాన్ మల్హోత్రా, ఆరోన్ జార్జ్ అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత బౌలర్లు రాణించారు. లంక జట్టును 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులకే కట్టడి చేశారు. కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లంక జట్టులో కెప్టెన్ విమత్ దిన్సార (32), చామిక హీనతిగల (42), సేత్మీక సెనవిరత్నే (30) మాత్రమే రాణించారు.

అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (9) త్వరగా ఔటయ్యారు. ఈ దశలో విహాన్ మల్హోత్రా (45 బంతుల్లో 61 నాటౌట్), ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించి, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికైన విహాన్ తన ఫామ్‌ను కొనసాగించాడు.

మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలిచింది. దీంతో 2014 తర్వాత అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. టైటిల్ సమరం ఈ నెల 21న దుబాయ్ లో జరగనుంది. 
Under-19 Asia Cup
India U19
Pakistan U19
Vihan Malhotra
Aaradhya Shukla
Cricket
Final
Sri Lanka U19
Dubai
Kanishk Chouhan

More Telugu News