మీ ఫస్ట్ క్రష్ ఎవరు?... ఈ ప్రశ్నకు నారా లోకేశ్ చెప్పిన సమాధానం ఇదే!

  • రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 'హలో లోకేష్' పేరుతో విద్యార్థులతో ముఖాముఖి
  • అమ్మ క్రమశిక్షణ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని వెల్లడి
  • బ్రహ్మణి తన మొదటి, చివరి క్రష్ అని ఆసక్తికర వ్యాఖ్య
  • తండ్రి చంద్రబాబుకు దక్కిన గౌరవం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న లోకేష్
  • విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ రూపొందిస్తామని హామీ
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో సరదాగా, స్ఫూర్తిదాయకంగా గడిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘హలో లోకేశ్’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు వ్యక్తిగత, రాజకీయ, సామాజిక ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా, ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఎన్.శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఓ విద్యార్థిని, "మీ అమ్మగారు మిమ్మల్ని మొదటిసారి ఎప్పుడు, ఎందుకు కొట్టారు?" అని అడిగిన ప్రశ్నకు లోకేశ్ నవ్వుతూ స్పందించారు. "మా అమ్మ ఇప్పటికీ రెండు దెబ్బలు కొడతారు. తల్లికి చెప్పలేని ఏ పనీ చేయకూడదని చాగంటి గారు చెప్పారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మగారే. ఆమె నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అనేది షరతులు లేనిది. ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలి" అని ఆయన ఉద్వేగంగా చెప్పారు. 

ఇక, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని మరో విద్యార్థి ప్రశ్నించగా... తన భార్య బ్రహ్మణి తన మొదటి, చివరి క్రష్ అని తెలిపారు. తనను కాలేజీలో ఎవరూ ర్యాగింగ్ చేయలేదని, అందరితో స్నేహంగా ఉండేవాడినని స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ, "2004-05 సమయంలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారికి ప్రజల నుంచి లభించే గౌరవాన్ని చూసి స్ఫూర్తి పొందాను. ఆయనకు దక్కిన గౌరవం నాకూ దక్కాలని అహర్నిశలు కష్టపడుతున్నాను" అని లోకేశ్ తెలిపారు. 

అవినీతిని అరికట్టేందుకు సంస్కరణలు కీలకమని, ‘మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా వెయ్యికి పైగా సేవలు అందిస్తున్నామని వివరించారు.

ఉన్నత విద్యపై తన విజన్‌ను పంచుకుంటూ, "పాఠ్యాంశాలు పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా ఉండాలి. అందుకే కరిక్యులమ్‌ను పునఃసమీక్షిస్తున్నాం. పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచి పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రధాని కూడా భావిస్తున్నారు. స్థానిక పరిశ్రమలతో విద్యార్థులకు అనుసంధానం పెంచాలి" అని ప్రిన్సిపల్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై స్పందిస్తూ, "ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. 2019లో మంగళగిరిలో నేను ఓడిపోయినా, కసితో పనిచేసి గెలిచాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు, ఆత్మహత్యల నివారణకు ప్రత్యేకంగా ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తాం" అని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రామచంద్రరావు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ మేఘా స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News