Yuvaraj Singh: బెట్టింగ్ యాప్స్ కేసు... క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Yuvaraj Singh Assets Attached in Betting App Case by ED
  • అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు ప్రముఖుల ఆస్తులు జప్తు
  • మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • నటుడు సోనూ సూద్, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి ఆస్తులు కూడా సీజ్
  • రూ.1000 కోట్లకు పైగా విలువైన 1xbet మనీలాండరింగ్ కేసులో చర్యలు
అక్రమ బెట్టింగ్ యాప్‍కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ జాబితాలో నటి నేహా శర్మ, మోడల్ ఊర్వశీ రౌతేలా తల్లి, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రాల ఆస్తులు కూడా ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5 కోట్లు, సోనూ సూద్‌కు చెందిన రూ.1 కోటి, మిమీ చక్రవర్తికి చెందిన రూ.59 లక్షలు, నేహా శర్మకు చెందిన రూ.1.26 కోట్లు, రాబిన్ ఊతప్పకు చెందిన రూ.8.26 లక్షలు, ఊర్వశీ రౌతేలా తల్లికి చెందిన రూ.2.02 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

విదేశాల్లో రిజిస్టర్ అయిన '1xbet' అనే అక్రమ బెట్టింగ్ యాప్ ద్వారా రూ.1000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో గతంలోనే ఈ సెలబ్రిటీలందరినీ ఈడీ విచారించింది. వారి ఆస్తులను 'అక్రమ సంపాదన'గా (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్) పరిగణించి తాజా చర్యలు తీసుకుంది. ఇదే కేసులో గతంలో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Yuvaraj Singh
Robin Uthappa
Betting Apps Case
Enforcement Directorate
ED
Money Laundering
Sonu Sood
Mimi Chakraborty
Neha Sharma
1xbet

More Telugu News