ట్రంప్ ఇచ్చిన క్రిస్మస్ విందుకు హాజరైన బాలీవుడ్ నటి మల్లికా షెరావత్

  • ఇది అపూర్వమైన అనుభూతి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న వీడియో షేర్ చేసిన మల్లిక
  • 2011లో ఒబామా హయాంలోనూ వైట్‌హౌస్‌కు వెళ్లిన నటి
ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన క్రిస్మస్ విందుకు ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందింది. నిన్న‌ జరిగిన ఈ వేడుకకు హాజరైన మల్లిక, తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇవాళ‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడి ఫొటోలను, వీడియోలను షేర్ చేశారు.

ఈ వేడుకలో పాల్గొనడం "మాటల్లో చెప్పలేని అద్భుతమైన అనుభూతి" అని మల్లికా పేర్కొన్నారు. తనకు ఈ గౌరవం దక్కినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్లు, విద్యుత్ దీపాల మధ్య దిగిన ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. ఆ వీడియోలో ప్రేక్షకుల్లో మల్లిక కూడా కనిపించారు.

మల్లికా షెరావత్‌కు వైట్‌హౌస్ నుంచి ఆహ్వానం రావడం ఇది రెండోసారి. గతంలో 2011లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆమె హాజరయ్యారు. 2008 అమెరికా ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన 'పాలిటిక్స్ ఆఫ్ లవ్' చిత్రంలో నటించినందుకు అప్పట్లో ఆమెను ఆహ్వానించారు.

కెరీర్ విషయానికొస్తే, 'మర్డర్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మల్లిక.. 'హిస్స్', 'పాలిటిక్స్ ఆఫ్ లవ్' వంటి అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించారు. ఇటీవల ఆమె రాజ్‌కుమార్ రావ్, తృప్తి డిమ్రితో కలిసి 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' చిత్రంలో కనిపించారు.


More Telugu News