Madan Mitra: శ్రీరాముడు హిందువు కాదు.. ముస్లిం: టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Madan Mitra Claims Lord Rama Was Muslim Sparks Controversy
  • రాముడు హిందువని నిరూపించాలంటూ బీజేపీ నేతలకు టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా సవాల్ 
  • ఇది హిందూ విశ్వాసాలను అవమానించడమేనన్న బీజేపీ
  • తన వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు వచ్చినా భయపడనన్న మదన్
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే మదన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. శ్రీరాముడు హిందువు కాదని, ఆయన ఒక ముస్లిం అని మదన్ మిత్రా పేర్కొనడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హిందూ విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని మండిపడింది.

ఓ కార్యక్రమంలో బెంగాలీలో మాట్లాడిన మదన్ మిత్రా, బీజేపీకి హిందూ మతంపై ఉన్న అవగాహనను ప్రశ్నించడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. తాను గతంలో ఢిల్లీలో ఓ బీజేపీ నేతతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "శ్రీరాముడు హిందువని నిరూపించండి. ఆయన ఇంటిపేరు ఏంటో చెప్పండి" అని తాను సవాల్ విసిరినట్లు తెలిపారు. ఆ ప్రశ్నకు సువేందు అధికారి సహా ఏ బీజేపీ నేత కూడా సమాధానం చెప్పలేకపోయారని అన్నారు.

మదన్ మిత్రా వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తీవ్రంగా ఖండించారు. "ప్రభు శ్రీరాముడు ముస్లిం అని టీఎంసీ ఎమ్మెల్యే అనడం హిందూ విశ్వాసాలను దారుణంగా అవమానించడమే. టీఎంసీ హిందూ వ్యతిరేక పార్టీ అని మరోసారి నిరూపించుకుంది" అని ఆయన విమర్శించారు.

అయితే, తన వ్యాఖ్యల వల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు వచ్చినా భయపడనని మదన్ మిత్రా స్పష్టం చేశారు. "ఈ మాట అంటున్నది నేను, మదన్ మిత్రాను. బీజేపీ నన్నేం చేస్తుంది? నన్ను కొడుతుందా?" అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఇది భారత సంస్కృతి, చరిత్రను కించపరచడమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వివాదంపై టీఎంసీ అధిష్ఠానం ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Madan Mitra
TMC MLA
Sri Rama
Hindu Muslim
West Bengal Politics
BJP
Hinduism
Pradeep Bhandari
Suvendu Adhikari

More Telugu News