FIFA: ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ భారీగా పెంపు.. విజేతకు కళ్లు చెదిరే మొత్తం

World Cup 2026 Winner to Get 50 Million Dollars
  • వచ్చే వరల్డ్ కప్‌కు భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
  • గత ఎడిషన్‌తో పోలిస్తే 50 శాతం అదనపు నిధులు
  • విజేతకు రూ. 451 కోట్లు.. రన్నరప్‌కు రూ. 274 కోట్లు
వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఫిఫా భారీగా పెంచింది. గత టోర్నమెంట్‌తో పోలిస్తే ఏకంగా 50 శాతం అధికంగా, రికార్డు స్థాయిలో 727 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,500 కోట్లు) వెచ్చించ‌నుంది. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఫిఫా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

ఈ నిధులలో సింహభాగం అంటే 655 మిలియన్ డాలర్లను టోర్నమెంట్‌లో పాల్గొనే 48 దేశాల ప్రదర్శన ఆధారంగా పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 415 కోట్లు), రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 274 కోట్లు) అందనున్నాయి. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే 16 జట్లకు కూడా తలా 9 మిలియన్ డాలర్లు లభిస్తాయి. వీటికి అదనంగా టోర్నీకి అర్హత సాధించిన ప్రతి దేశానికి సన్నాహక ఖర్చుల కింద 1.5 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఫిఫా స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో మాట్లాడుతూ, "ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేది ప్రపంచ ఫుట్‌బాల్ కమ్యూనిటీకి ఆర్థికంగా ఒక మైలురాయిగా నిలవనుంది" అని అన్నారు.

ఇదే సమావేశంలో ఫిఫా కౌన్సిల్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026 నుంచి అండర్-15 విభాగంలో ఫెస్టివల్ తరహా యూత్ టోర్నమెంట్లను నిర్వహించనుంది. ముందుగా 2026లో బాలురకు, 2027లో బాలికలకు ఈ పోటీలు జరుగుతాయి. "యువత ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు ఫిఫా చేస్తున్న కృషిలో ఇది ఒక ముందడుగు" అని ఇన్ఫాంటినో వివరించారు. అలాగే 2028 మహిళల క్లబ్ వరల్డ్ కప్‌ను జనవరి 5 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు కూడా ఫిఫా వెల్ల‌డించింది.
FIFA
FIFA World Cup 2026
Prize Money
Football
Gianni Infantino
FIFA Council
Youth Tournament
Womens World Cup

More Telugu News