Justice Surya Kant: రిటైర్మెంట్‌కు ముందు సిక్సర్లు.. జడ్జీల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Supreme Court Comments on Judges Issuing Orders Before Retirement
  • రిటైర్మెంట్‌కు ముందు జడ్జీలు వరుస ఆర్డర్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆందోళన
  • ఇదో దురదృష్టకరమైన ట్రెండ్‌గా మారిందని వ్యాఖ్య
  • ఆఖరి ఓవర్లలో బ్యాటర్ సిక్సర్లు కొట్టినట్టుగా ఉందని పోలిక
పదవీ విరమణకు ముందు కొందరు న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర్వులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ధోరణిని క్రికెట్‌లో ఆఖరి ఓవర్లలో బ్యాటర్ ‘సిక్సర్లు కొట్టడంతో’ పోల్చింది. జడ్జీలలో ఈ తరహా పోకడ పెరగడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జి తన రిటైర్మెంట్‌కు 10 రోజుల ముందు సస్పెన్షన్‌కు గురయ్యారు. రెండు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణలతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. "పిటిషనర్ తన రిటైర్మెంట్‌కు ముందు సిక్సర్లు కొట్టడం ప్రారంభించారు. ఇది ఒక దురదృష్టకరమైన ట్రెండ్. దీనిపై మేము ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు" అని ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది విపిన్ సంఘీ వాదనలు వినిపిస్తూ తన క్లయింట్‌కు మంచి సర్వీస్ రికార్డు ఉందని, కేవలం న్యాయపరమైన ఉత్తర్వుల కోసం సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. పై కోర్టులలో సవాలు చేయగల ఉత్తర్వుల కోసం క్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

అయితే, న్యాయపరమైన పొరపాట్లకు, దురుద్దేశపూర్వక ఉత్తర్వులకు మధ్య తేడా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. "కేవలం పొరపాటు జరిగి ఉంటే సస్పెండ్ చేయలేరు. కానీ ఆ ఉత్తర్వులు ఉద్దేశపూర్వకంగా, నిజాయతీ లేకుండా ఇస్తే పరిస్థితి ఏంటి?" అని సీజేఐ ప్రశ్నించారు.

ఈ పిటిషన్‌పై నేరుగా జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ముందుగా మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది. ఈ అభ్యర్థనను నాలుగు వారాల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.
Justice Surya Kant
Supreme Court
retirement
judges
orders
suspension
Madhya Pradesh High Court
court orders
justice system

More Telugu News