నేటి సాయంత్రం ఢిల్లీ వెళుతున్న సీఎం చంద్రబాబు

  • రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు
  • రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై ప్రధానంగా చర్చ
  • శుక్రవారం రాత్రి తిరిగి అమరావతికి పయనం
  • శనివారం అనకాపల్లి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమంలో హాజరు
రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అవుతారు. 

ఈ సమావేశాల్లో కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన నిధులు, అనుమతులపై చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రికే ఆయన తిరిగి అమరావతి చేరుకుంటారు. అనంతరం శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.


More Telugu News