మహిళా డాక్టర్ హిజాబ్ తొలగింపు: సీఎం నితీశ్‌పై జావేద్ అక్తర్ తీవ్ర ఆగ్రహం

  • మహిళా డాక్టర్ హిజాబ్ తొలగింపు ఘటనపై భగ్గుమన్న జావేద్ అక్తర్
  • నితీశ్ కుమార్ చర్యను తీవ్రంగా ఖండించిన ప్రముఖ రచయిత
  • ఈ దుశ్చర్యను ఆమోదించలేనని స్పష్టీకరణ
  • నితీశ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను బలవంతంగా తొలగించిన ఘటనపై బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇలా ప్రవర్తించడం దారుణమని, ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. బాధితురాలైన ఆ వైద్యురాలికి నితీశ్ కుమార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సోమవారం పాట్నాలో ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమంలో నితీశ్ కుమార్.. ఓ ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్‌ను తొలగించడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు ఈ ఘటనను ఇప్పటికే ఖండించాయి. తాజాగా ఈ వివాదంపై జావేద్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"నా గురించి తెలిసిన వాళ్లందరికీ నేను 'పరదా' (ముసుగు) విధానానికి వ్యతిరేకినని తెలుసు. కానీ, నేను దాన్ని వ్యతిరేకించినంత మాత్రాన, ఒక మహిళ పట్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడాన్ని సమర్థించలేను. నితీశ్ కుమార్ చేసిన పనిని ఏ రకంగానూ ఆమోదించలేం. ఈ దుశ్చర్యను తీవ్ర పదజాలంతో ఖండిస్తున్నాను. ఆయన వెంటనే ఆ మహిళకు క్షమాపణ చెప్పాలి" అని జావేద్ అక్తర్ తన పోస్టులో పేర్కొన్నారు. 


More Telugu News