భారత వినియోగదారులకు 'ట్రూకాలర్' నుంచి పవర్‌ఫుల్ ఫీచర్... ఉచితంగానే!

  • భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్లకు ఏఐ వాయిస్‌మెయిల్ ఫీచర్
  • వాయిస్ మెసేజ్‌లను తక్షణమే టెక్ట్స్ గా మార్చే ఫీచర్
  • వాయిస్ మెసేజ్‌లు నేరుగా ఫోన్‌లోనే స్టోర్ అయ్యే సౌకర్యం
  • తెలుగుతో సహా 12 భారతీయ భాషల్లో ట్రాన్స్‌క్రిప్షన్
  • స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేసే టెక్నాలజీ
ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్, భారత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒక శక్తిమంతమైన, ఉచిత ఏఐ ఫీచర్‌ను గురువారం ప్రారంభించింది. 'ట్రూకాలర్ వాయిస్‌మెయిల్' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త సదుపాయం ద్వారా యూజర్లు వాయిస్ మెసేజ్‌లను తక్షణమే టెక్ట్స్ గా  (ట్రాన్స్‌క్రిప్షన్) మార్చుకోవచ్చు. స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి అడ్డుకునేలా దీనిని రూపొందించారు.

సాంప్రదాయ వాయిస్‌మెయిల్స్‌లా కాకుండా, ఈ మెసేజ్‌లు నేరుగా యూజర్ ఫోన్‌లోనే స్టోర్ అవుతాయి. దీనివల్ల రికార్డింగ్‌లపై పూర్తి నియంత్రణ, ప్రైవసీ లభిస్తుంది. పిన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం లేదా ప్రత్యేక నంబర్లకు డయల్ చేయడం వంటి అవసరం ఉండదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ సహా మొత్తం 12 భారతీయ భాషల్లో వాయిస్‌మెయిల్‌ను టెక్ట్స్ గా మార్చుకునే సౌకర్యం కల్పించారు. దీనివల్ల మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా వినడానికి వీలుకాని పరిస్థితుల్లో వాయిస్‌మెయిల్‌ను సులభంగా చదువుకోవచ్చు.

ఈ ఫీచర్‌పై ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ, "సాంప్రదాయ వాయిస్‌మెయిల్ పాత తరం కమ్యూనికేషన్ కోసం రూపొందించబడింది. మేము ఈ విధానాన్ని పూర్తిగా మారుస్తున్నాం. వాయిస్ మెసేజ్‌లను ఉచితంగా, నేరుగా ఫోన్‌లోనే స్టోర్ అయ్యేలా, స్పామ్ ప్రొటెక్షన్‌తో అందిస్తున్నాం. ప్రజలు నేడు కమ్యూనికేట్ చేసే విధానానికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దాం" అని వివరించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా ట్రూకాలర్‌ను వినియోగిస్తున్నారు. కేవలం 2024లోనే సుమారు 56 బిలియన్ల స్పామ్ కాల్స్‌ను ఈ యాప్ గుర్తించి బ్లాక్ చేసింది.


More Telugu News