పశ్చిమ హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు.. మంచు కరవై బోసిపోయిన పర్వతాలు

  • పశ్చిమ హిమాలయాల్లో తీవ్ర కరవు పరిస్థితులు
  • వర్షాలు, మంచు కొరతతో ఎండిపోతున్న పర్వతాలు
  • వ్యవసాయం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం
పశ్చిమ హిమాలయాలు తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ శీతాకాలంలో వర్షాలు, హిమపాతం పూర్తిగా కరవవడంతో, సాధారణంగా మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు ఇప్పుడు బోసిపోయి, ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అక్టోబర్ 6న ఒకసారి మాత్రమే స్వల్పంగా వర్షం, మంచు కురవగా, ఆ తర్వాత పూర్తిగా పొడి వాతావరణమే నెలకొంది.

జీ న్యూస్ కథనం ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పశ్చిమ కల్లోలాల (Western Disturbances) ప్రభావం తగ్గడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా అక్టోబర్ మధ్య నుంచి పశ్చిమ కల్లోలాలు మొదలై, నవంబర్, డిసెంబర్ నాటికి భారీ హిమపాతాన్ని అందిస్తాయి. కానీ, 2024 తరహాలోనే ఈ ఏడాది కూడా వాటి జాడ కనిపించడం లేదు.

డిసెంబర్ చివరి నాటికి కూడా పెద్దగా ఉపశమనం లభించే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ 20-21 తేదీల మధ్య ఒక పశ్చిమ కల్లోలం ఏర్పడినా, దాని ప్రభావం కేవలం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాలకే పరిమితం కానుంది. హిమాచల్ ప్రదేశ్‌లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడొచ్చు కానీ, ఉత్తరాఖండ్‌లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగనుంది.

ఈ ప్రభావం హిమాలయ నదుల ప్రవాహంపై స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం, ముఖ్యంగా యాపిల్ తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు, మంచు లేకపోవడంతో హిల్ స్టేషన్లు, స్కీయింగ్ రిసార్టులకు పర్యాటకుల తాకిడి తగ్గి ఆ రంగం కూడా కుదేలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో హిమాలయ నదులపై ఆధారపడిన మైదాన ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.


More Telugu News