విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • పరస్పర విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
  • ఏడాది పాటు విడిగా జీవించాలన్న నిబంధన తప్పనిసరి కాదన్న హైకోర్టు
  • ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను కూడా మాఫీ చేయవచ్చని వెల్లడి
  • దంపతులను బలవంతంగా కలిపి ఉంచడం సరికాదన్న ధర్మాసనం
పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడానికి ముందు కనీసం ఏడాదిపాటు విడిగా జీవించాలనే నిబంధన తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఫ్యామిలీ కోర్టు లేదా హైకోర్టు ఈ కాలాన్ని మాఫీ చేయవచ్చని పేర్కొంది.

విడాకుల ప్రక్రియలో మొదటి, రెండవ మోషన్ల మధ్య ఉండే ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను కూడా స్వతంత్రంగా మాఫీ చేసే అధికారం కోర్టులకు ఉందని ధర్మాసనం తెలిపింది. విడిపోవాలని నిశ్చయించుకున్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని వ్యాఖ్యానించింది. అలా చేయడం వారి ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడింది.

శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని, జస్టిస్ రేణు భట్నాగర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుతో పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునే వారికి విడాకుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. 


More Telugu News