తండ్రితో గొడవపడి పీవోకే నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మహిళ!

  • పూంచ్ జిల్లాలోకి వచ్చినట్లు తెలిపిన ఆర్మీ దళాలు
  • కోట్లి ప్రాంతానికి చెందిన షెహ్నాజ్ అక్తర్‌గా గుర్తింపు
  • మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ తండ్రితో గొడవపడి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి భారత్‌లోకి ప్రవేశించింది. నియంత్రణ రేఖను దాటి జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోకి వచ్చిన ఆమెను భారత ఆర్మీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

ఆ మహిళను పాకిస్థాన్‌లోని కోట్లి ప్రాంతానికి చెందిన షెహ్నాజ్ అక్తర్ (35)గా గుర్తించారు. సరిహద్దులోని బాలాకోట్ సెక్టార్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విచారణలో ఆమె తన తండ్రితో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి ఎల్ఓసీ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు చెప్పిందని అధికారులు వెల్లడించారు. భారత్‌లో అక్రమంగా ప్రవేశించడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఆ మహిళను పోలీసులకు అప్పగిస్తామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.


More Telugu News