వచ్చే జనవరి నుంచి జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు

  • ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
  • ఇకపై జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతానని వెల్లడి
  • మూడు నెలల్లో పట్టణాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయాలని ఆదేశం
  • తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం
  • వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్సులు లక్ష్యంగా పనిచేయాలని సూచన
ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఏమాత్రం జాప్యం సహించేది లేదని, ‘జీరో టాలరెన్స్’ విధానంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారుల పనితీరును పరిశీలించేందుకు జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఆయన హెచ్చరించారు.

కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ శాఖలో ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయో విశ్లేషణ చేసి, పాలనను మెరుగుపరచాలన్నారు. గ్రీవెన్సులు తక్కువగా వస్తేనే పాలన బాగున్నట్లు లెక్క అని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే త్రైమాసికానికి ‘జీరో గ్రీవెన్సుల’ను లక్ష్యంగా నిర్దేశించారు.

రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలను రాబోయే మూడు నెలల్లోగా పూర్తిగా శుభ్రపరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే జలవనరుల శాఖ వెంటనే స్పందించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. నీటి భద్రత గురించి మాట్లాడుతున్న తరుణంలో ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండకూడదని చంద్రబాబు తేల్చిచెప్పారు.


More Telugu News