టీ20 ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తే నెంబర్ 1.. కెరీర్ బెస్ట్ రేటింగ్ నమోదు

  • టీ20 బౌలింగ్‌లో అగ్రస్థానంలో వరుణ్ చక్రవర్తి
  • కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు నమోదు
  • బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి తిలక్ వర్మ
  • ర్యాంకులు మెరుగుపరుచుకున్న అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్ సంచలనం వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో రెండేసి వికెట్లు పడగొట్టిన అతడు, కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్నాడు.

తాజాగా వరుణ్ చక్రవర్తి ఖాతాలో అదనంగా 36 రేటింగ్ పాయింట్లు చేర‌డంతో మొత్తం 818 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ (699) కంటే వరుణ్ 119 పాయింట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ద‌క్షిణాఫ్రికా సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు చేరుకున్నాడు.

బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ భారత యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నెంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకోగా, తిలక్ వర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి ఇద్దరు భారత బ్యాటర్లు టాప్ 5లో స్థానం సంపాదించారు. 

ఆల్‌రౌండర్ల జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన సైమ్ అయూబ్ అగ్రస్థానంలో ఉండగా, భారత్ నుంచి హార్దిక్ పాండ్యా (4), అక్షర్ పటేల్ (9) టాప్ 10లో ఉన్నారు. శివమ్ దూబే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నాడు.


More Telugu News