మా తండ్రిని మళ్లీ చూడలేమేమో... ఆయనను హింసిస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్ తనయులు

  • నిర్బంధ గదిలో ఉంచి మానసిక హింసకు గురి చేస్తున్నారన్న తనయులు
  • మా తండ్రితో మాట్లాడి చాలా కాలమైందన్న ఇమ్రాన్ ఇద్దరు తనయులు
  • జైలు గది పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని వెల్లడి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆయన కుమారులు కాసిం ఖాన్, సులేమాన్ ఇసా ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రితో మాట్లాడి చాలా కాలమైందని, జైలులో ఉన్న తమ తండ్రిని మళ్లీ ఎప్పటికీ చూడలేమేమోనని వారు భయాందోళన వ్యక్తం చేశారు. 'స్కై న్యూస్' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌ను రెండేళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి మురుగునీరు ఇస్తున్నారని, హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయనను ఉంచారని ఆరోపించారు. తన తండ్రి ఉన్న జైలు గది పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరితోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారని అన్నారు. ఆయనను బయటకు తీసుకురావడానికి ఏ మార్గం కనిపించడం లేదని వాపోయారు.

అయినప్పటికీ తమకు నమ్మకం ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు దిగజారుతున్నాయని, ఆయన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేమేమోననే ఆందోళన ఉందని అన్నారు. ఇమ్రాన్‌ను ఉంచిన జైలు పరిస్థితులు అసహ్యంగా ఉన్నాయని, అతనితో మాట్లాడేందుకు జైలు అధికారులు తమకు అనుమతివ్వడం లేదని ఆరోపించారు. రోజులో ఎక్కువ సేపు తన తండ్రిని నిర్బంధ గదిలోనే ఉంచుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన జైలు జీవితం ఉందని వారు పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా అడియాలా జైలు ముందు భారీగా నిరసన తెలిపారు. సోదరి ఉజ్మా ఖానుమ్ ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. ఆయన జైల్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.


More Telugu News